: మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ బీజేపీవే: సీఎన్ఎన్ సర్వే
మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలలో ముచ్చటగా మూడోసారి కమలం అధికార పీఠాన్ని కైవసం చేసుకోనుంది. సీఎన్ఎన్ ఐబీఎన్, ద వీక్ మీడియా సంస్థల కోసం 'సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ స్టడీస్' నిర్వహించిన ఎన్నికల సర్వేలో ఇది వెల్లడైంది. మధ్యప్రదేశ్ లో బీజేపీ 44 శాతం ఓట్లతో 148 నుంచి 160 సీట్ల వరకు సొంతం చేసుకోనుంది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీకి 37.6 శాతం ఓట్లు, 143 సీట్లే లభించాయి. కాంగ్రెస్ పార్టీకి 52 నుంచి 62 మధ్య సీట్లు లభించనున్నాయి. 2008లో ఈ పార్టీకి 71 సీట్లు లభించాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలోని 35 నియోజకవర్గాలలో 2,870 ఓటర్లను ప్రశ్నించి ఫలితాలను మదింపు వేశారు.
91 స్థానాలు కలిగిన చత్తీస్ గఢ్ అసెంబ్లీలో బీజేపీకి 61 నుంచి 71 స్థానాలు లభిస్తాయని సర్వే చెబుతోంది. కాంగ్రెస్ కు 16 నుంచి 24 స్థానాలు మాత్రమే రానున్నాయి. బీజేపీ 2008లో 49 స్థానాలలో విజయం సాధించగా ఈసారి తన బలాన్ని మరింత పెంచుకోనుంది. కాంగ్రెస్ మాత్రం 2008లో వచ్చిన 38 స్థానాలలో చాలా వరకు కోల్పోనుంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 46 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 32 శాతం ఓట్లు లభిస్తాయని సర్వేలో తేలింది.