: జేసీ దివాకర్ రెడ్డి టీడీపీలోకి వెళతారా?
మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి టీడీపీలోకి వెళతారా? ఇటీవల కాంగ్రెస్ పార్టీపై ఆయన చేస్తున్న విమర్శలు చూస్తుంటే.. టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యే అలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. జగన్ తో కాంగ్రెస్ అధిష్ఠానం కుమ్మక్కయి సీమాంధ్రలో పార్టీని భూస్థాపితం చేసిందని జేసీ దివాకర్ రెడ్డి బహిరంగంగానే విమర్శించారు.
ఇదే విషయమై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ నిన్న దివాకర్ రెడ్డి వద్ద అభ్యంతరం వ్యక్తం చేశారు. బహిరంగంగా విమర్శలు చేయవద్దని, అలా మాట్లాడాలనుకుంటే పార్టీ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. తనను కాంగ్రెస్ నుంచి పొమ్మనే హక్కు ఎవరికీ లేదని దివాకర్ రెడ్డి బొత్సతో అన్నారు. అయితే, ఇటీవలి పరిణామాలను చూస్తే జేసీ దివాకర్ రెడ్డి, ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వెళతారనే ప్రచారం జరుగుతోంది. ఇదెంత వాస్తవమో సమీప కాలంలోనే తేలనుంది.