: భద్రతా ఏర్పాట్లలో నితీశ్ సర్కారు వైఫల్యం
పాట్నా పేలుళ్లలో నితీశ్ కుమార్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పేలుళ్లు జరిగే రోజు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ 'హుంకార్' సభ ఉండడంతోపాటు అంతకుముందు రోజే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాట్నాలో పర్యటించి వెళ్లారు. ఇద్దరు ప్రముఖుల పర్యటనల నేపథ్యంలో పాట్నాలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయడంలో నితీశ్ సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫలితమే బాంబు పేలుళ్లు. అదే సమయంలో తమకు తమ రాష్ట్ర ఇంటెలిజెన్స్, కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థల నుంచి ఎలాంటి సమాచారం లేదని నితీశ్ చెప్పడం గమనార్హం.
అసలు పాట్నాలో సరైన పోలీసు తనిఖీలు కూడా లేవని తెలుస్తోంది. గాంధీ మైదానానికి ఎనిమిది గేట్లు ఉంటే ఒక్కదాని దగ్గరే సరిపడా పోలీసులు ఉన్నారు. మెటల్ డిటెక్టర్లు కూడా వారి వద్ద లేవు. బీహార్ రాష్ట్ర బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ తాము చాన్నాళ్ల ముందే పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరినా నితీశ్ సర్కారు పెడచెవిన పెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా పేలుళ్లు నితీశ్ సర్కారు వైఫల్యమేనని వ్యాఖ్యానించారు.