: సీనియర్ నటి సరిత వివాహ బంధంలో కలహాలు


'ఏ తీగ పూవును, ఏ కొమ్మ తేటినో, కలిపింది ఏ వింత అనుబంధమవునో' అంటూ దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన 'మరో చరిత్ర' చిత్రంలోని పాటతో సినీరంగానికి పరిచయమైన అలనాటి కథానాయిక సరిత అందరికీ గుర్తుండే ఉంటుంది. తదనంతర కాలంలో నటనకు ప్రాధాన్యమున్న పలు చిత్రాల్లో నటించి మెప్పించిన అద్భుతమైన నటి ఆమె. అయితే, నటి సరిత వివాహ బంధంలో ప్రస్తుతం కలహాలు చెలరేగాయి. ఆమె ఇండియాలో లేని సమయం చూసి భర్త ముఖేష్ మాధవన్ మరో వివాహం చేసుకున్నాడు. ఈ వార్తతో మీడియా ఎదుటకు వచ్చిన సరిత తన భర్త వ్యవహారంపై మండిపడింది.

ఆమె మాట్లాడుతూ.. ముఖేష్ తో పెళ్లైన తర్వాత మంచి పాత్రలు చేయడానికి తనకు అనుమతి లభించలేదని, ఈ కారణంగా ఎన్నో మంచి అవకాశాలు వదులుకున్నానని చెప్పింది. ఇది పక్కనబెడితే, తనపట్ల ముఖేష్ వైఖరి కూడా సరిగాలేదని, శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టేవాడని తెలిపింది. మద్యానికి బానిసై బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుండటంతో తమ పిల్లలపైన ఆ ప్రభావం పడిందని వెల్లడించింది. అందువల్ల విడిపోవాలనుకుని 2007లో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయిస్తే అందుకు భర్త నిరాకరించాడని చెప్పింది. మళ్లీ 2009లో కేసు పెట్టానని, ముఖేష్ కోర్టుకు హాజరుకాకపోవడంతో దాన్నీ ఉపసంహరించుకున్నట్లు చెప్పింది.

దాంతో, అప్పటినుంచీ ఎవరికి వారుగా జీవిస్తున్నామంది. తమ కుమారుడు శ్రవణ్ ముఖేష్ దుబాయ్ లో వైద్యవిద్య చదువుతుండటంతో అక్కడికి వెళ్లానని, ఇదే అదునుగా భావించి డాన్సర్ మెతిల్ దేవికాను పెళ్లి చేసుకున్నాడని వివరించింది. చట్టపరంగా తన నుంచి విడిపోకుండా ముఖేష్ మరో వివాహం ఎలా చేసుకుంటాడని సరిత ప్రశ్నించింది. ఈ విషయాన్ని చట్టపరంగా ఎదుర్కుంటానని, తన ఇద్దరు పిల్లలు శ్రవణ్, తేజాస్ ముఖేష్ ను తనే చూసుకుంటున్నానని చెప్పింది.

  • Loading...

More Telugu News