: ఈ బ్రేస్‌లెట్ భలే!
బ్రేస్‌లెట్ ఎందుకు వేసుకుంటాం... చేతికి కాస్త అందాన్నిచ్చేందుకు, మన అందమైన చేయి మరింత అందంగా కనిపించేందుకు ఎక్కువమంది బ్రేస్‌లెట్‌ను ధరిస్తారు. ఇప్పుడైతే ఇవి రకరకాల మోడళ్లలో వచ్చాయి. వీటిలో కొన్ని కేవలం అలంకరణార్ధమే కాకుండా ఇతర ప్రయోజనాలను కూడా కలిగించేవిగా తయారుచేస్తున్నారు. ఇలా తయారుచేసిన వాటిలో మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే బ్రేస్‌లెట్ ఒకటి. దీన్ని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తయారుచేశారు.
మన చుట్టుపక్కల ఉండే గాలి, చర్మ ఉష్ణోగ్రతలను గమనిస్తూ సమయానుకూలంగా పనిచేస్తూ మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే ఒక సరికొత్త బ్రేస్‌లెట్‌ను శాస్త్రవేత్తలు తయారుచేశారు. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన నలుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులు ఈ థర్మో ఎలక్ట్రిక్ బ్రేస్‌లెట్‌ను తయారుచేశారు. దీనికి రిస్టిఫై అనే పేరుపెట్టారు. ఈ బ్రేస్‌లెట్ గాలి, చర్మ ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరాన్ని బట్టి వేడి లేదా శీతల తరంగాలను మణికట్టుకు పంపుతుంది. తద్వారా దీన్ని ధరించిన వారికి ఉష్ణపరమైన ఉపశమనం లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.