: రావినారాయణ రెడ్డి ఇప్పుడు గుర్తొచ్చొడా..?: వినోద్
సమైక్య శంఖారావం సభలో జగన్.. తెలంగాణ ప్రాంత నాయకులైన రావి నారాయణ రెడ్డి, బూర్గుల రామకృష్ణారావు పేర్లు స్మరించుకోవడంపై టీఆర్ఎస్ మండిపడుతోంది. ఈ పార్టీ నేత వినోద్ నేడు హైదరాబాదు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఒకప్పుడు కమ్యూనిస్టు నేత సురవరం సుధాకర్ రెడ్డి.. రావి నారాయణ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారని వినోద్ తెలిపారు. కానీ, ప్రభుత్వం సురవరం విజ్ఞప్తిపై స్పందించలేదని తెలిపారు. ఇప్పుడు ఆయన పేరు ప్రస్తావిస్తున్న నేతలందరూ అప్పుడు ఎక్కడికి వెళ్ళారని వినోద్ ప్రశ్నించారు. సీమాంధ్ర స్వార్థ రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఇంకే కావాలని వినోద్ దుయ్యబట్టారు. నిన్న సమైక్య శంఖారావం సభలో జగన్ మాట్లాడుతూ.. 'నాది వీర తెలంగాణే తప్ప.. వేరు తెలంగాణ కాదు' అని రావి నారాయణ రెడ్డి అన్నారని గుర్తు చేసిన సంగతి తెలిసిందే.