: బరువు పెరుగుతున్నారా... జాగ్రత్త!
మన శరీర బరువు ఏమాత్రం పెరిగినా దాని ప్రభావం మన శరీరంపైనే కాదు మన ఆరోగ్యంపై కూడా పడుతుంది. ఇప్పుడైతే చక్కగా ఎంత ఎత్తుకు ఎంత బరువుండాలి? అనే విషయాలను చక్కగా లెక్కించి చెప్పే మెషిన్లు వచ్చేశాయి. దీంతో కావలసినప్పుడు మన బీఎంఐ చూసుకుని జాగ్రత్త పడితే చాలు. ఇందులో ఏమాత్రం తేడా కనిపించినా, బరువు పెరిగినట్టు అనిపించినా మనం జాగ్రత్తపడాల్సిందేనంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే బిఎంఐ ప్రకారం మన శరీర ఎత్తుకు తగినట్టు కాకుండా ఏమాత్రం బరువు పెరిగినా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.
గుండె జబ్బులేని సుమారు 1.58 లక్షల మందిని శాస్త్రవేత్తలు నాలుగేళ్లపాటు పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించారు. బీఎంఐలో ప్రతి ఐదు యూనిట్ల పెరుగుదలతో మనిషిలో గుండెపోటు, గుండెనొప్పి ముప్పు 23 శాతం ఎక్కువవుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ గ్రేస్ జోషీ చెబుతున్నారు. బీఎంఐ 20 నుండి 22.5 వరకు గలవారికి ముప్పు తక్కువగాను, ఆ తర్వాత ఉన్నవారికి ముప్పు ఎక్కువగాను ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి బరువు పెరుగుదల విషయంలో ఈ స్థాయిలో పెరిగితే ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పడానికి ఎలాంటి సురక్షిత స్థాయి అనేది లేదని, కాబట్టి బరువు పెరుగుదలను అదుపుచేసుకుంటే మేలని సూచిస్తున్నారు.