: తమ భవిష్యత్తు ఏంటని అందరూ ఉద్యమబాట పట్టారు: జగన్
సమైక్య శంఖారావం సభలో జగన్ ప్రసంగం మొదలైంది. వర్షాల కారణంగా రాష్ట్రంలో మరణించిన 20 మంది ఆత్మశాంతి కోసం మౌనం పాటించాలని జగన్ సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తమ భవిష్యత్తు ఏంటని గత 80 రోజులుగా అందరూ ఉద్యమంలోనే ఉన్నారని వివరించారు. విద్యార్థి తన చదువు పూర్తయిన తర్వాత భవిష్యత్తు ఏమిటని ఉద్యమంలోకి వచ్చాడని, తమకు రావాల్సిన జీతాలు రాకపోయినా.. తర్వాతి తరాల వారి భవిష్యత్తు కోసం ఉద్యోగులు, నీళ్ళ కోసం రైతన్న, తమ బిడ్డల కోసం మహిళలు.. ఇలా అందరూ ఉద్యమబాట పడుతున్నారని జగన్ పేర్కొన్నారు.
వీరందరికీ అన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవడం సరికాదని కాంగ్రెస్ పార్టీకి హితవు పలికారు. విభజన అనంతరం న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ విషయం కొడుకును ప్రధాని చేయాలనుకున్న సోనియాకు తట్టడం లేదని, ప్యాకేజీలు కోరుతున్న చంద్రబాబుకూ పట్టడం లేదని విమర్శించారు.