: చంద్రబాబు నీదేం బ్రతుకయ్యా?: ఎంపీ మేకపాటి
'చంద్రబాబు నాయుడూ నీదేం బ్రతుకయ్యా.. ఛీఛీ... నీ మాతృభూమి రుణం తీర్చుకునేది ఇలాగేనా?' అని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రశ్నించారు. సమైక్య శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ, 'చిత్తూరులో పుట్టావు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 9 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు. అలాంటిది తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తావా?' అని బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నీ ఉత్తరం వెనక్కి తీసుకుని తెలుగుజాతికి మేలు చేయి' అని ఆయన హితవు పలికారు. ఇక, రెండుసార్లు అధికారాన్ని కట్టబెట్టిన తెలుగు ప్రజల సహాయాన్ని మరచి విభజన చేయడం సోనియా గాంధీకి తగదని హితవు పలికారు. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఫజుల్ అలీ కమిషన్ చెప్పిందనీ, ఆ సూచనలు కూడా విస్మరించి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు దారుణమని ఆయన అన్నారు. ఎన్డీయే కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ నిబంధనలను, విధివిధానాలను కాదని తప్పుడు పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్ విభజనకు పూనుకుందని మేకపాటి మండిపడ్డారు.
హైదరాబాద్ అందరిదనీ, రాజధాని అభివృద్ధిలో అందరికీ పాత్ర ఉందని ఆయన తెలిపారు. గతంలో చెన్నారెడ్డి తెలంగాణ ఏర్పాటు కోరినా ఇందిరాగాంధీ అది సాధ్యంకాదని చెప్పిన మీదట.. రెండుసార్లు చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాజకీయ నేతలకు ముఖ్యమంత్రి పదవి కావాలంటే కనుక, ప్రజామోదంతో పదవులు సాధించుకోవచ్చనీ, దానిని ఎవరూ కాదనరనీ ఆయన అన్నారు. 'ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ, విద్యుత్తు కార్మికులు 80 శాతం ఆదాయమిచ్చే నగరాన్ని వదులుకుని ఎలా అభివృద్ధి సాధిస్తారు?' అని ఆయన ప్రశ్నించారు.
'రాజశేఖరరెడ్డి బతికుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదా?' అని మేకపాటి ప్రశ్నించారు. అలాంటి పరిస్థితి రాకుండా వైఎస్సార్సీపీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు అన్నారు.