: చంద్రబాబు ప్రకటించగలరా.. విభజన నిర్ణయం తనదని: జూపూడి సూటి ప్రశ్న
చంద్రబాబు నాయుడు తెలంగాణ నిర్ణయం తనదని ప్రకటించగలరా..? అని వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్ సూటిగా ప్రశ్నించారు. అలా ప్రకటిస్తే సీమాంధ్రలో ఆయన పార్టీ భూస్థాపితం అవుతుందన్న కోణంలో జూపూడి మాట్లాడారు. సమైక్య శంఖారావంలో ఆయన మాట్లాడుతూ.. దేశ రాజకీయాలను మార్చిన అనేక సంఘటనలు ప్రజల ద్వారానే సాధ్యమయ్యాయన్నారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా రాజకీయ పార్టీలు నిర్ణయాలు మార్చుకోవాల్సిన అవసరముందని అన్నారు. విభజన స్వార్ధపూరితంగా తీసుకున్న నిర్ణయం అని ఆయన ఆరోపించారు. జగన్ పై కక్షతో రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయం విభజన నిర్ణయం అని ఆయన మండిపడ్డారు. ప్రజలందరూ ఇప్పుడు జగన్ సైన్యమని, వర్షాలను కూడా లెక్క చేయకుండా వారు సభకు వచ్చారని జూపూడి హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రలో భారీ వర్షాల కారణంగా సభ జరగదని ప్రత్యర్థులు ఆశించారని, కానీ వర్షాలు కూడా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఆగి పోయాయని అన్నారు. జగన్ తుపాను ఢిల్లీని తాకిందన్నారు. ఆ తుపాను వాయుగుండంలో కొట్టుకుపోవడానికి ప్రత్యర్థి పార్టీలన్నీ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరిని అడిగి, ఎవరికోసం ఈ నిర్ణయం ప్రకటించారని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.