: కాంగ్రెస్ తరపున సచిన్ ఎన్నికల ప్రచారం!
అంతర్జాతీయ క్రికెట్ నుంచి త్వరలో వైదొలగుతున్న క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. రిటైర్మెంటు అనంతరం ఏం చేస్తాడన్న దానిపై నెలకొన్న సందిగ్ధం కొంతమేరకు వీడుతోంది. ఈ క్రమంలో సచిన్ రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తాడని అనేక వార్తలు వచ్చాయి. అటు, కాంగ్రెస్ కూడా టెండూల్కర్ ద్వారా ఓట్లు రాబట్టుకోవాలని చూసింది. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. గతేడాది రాజ్యసభ సభ్యుడిగా సచిన్ నామినేట్ అయ్యాడు. ఈ క్రమంలో నవంబర్ లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు ఈ క్రికెట్ దేవుడు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ప్రచారపు తేదీలు ఇంతవరకు ఖరారు కాలేదు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత ప్రమోద్ గుజాలియా స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ తరపున ప్రచారం చేయాలని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సచిన్ ను అంతకుముందు కోరిన సంగతి తెలిసిందే.