: మగువలే మహా సమర్ధులట!
ఏ పనినైనా చక్కబెట్టగల సామర్ధ్యం మహిళల్లోనే ఎక్కువగా ఉంటుందట. అందునా ఒకే సమయంలో రెండు మూడు పనులను చక్కబెట్టగల సామర్ధ్యం మాత్రం వారిలోనే అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా రుజువుచేశారు. ఏదైనా పనికి సంబంధించి వ్యూహ రచన, ప్రణాళిక, దాని అమలు విషయంలో పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువ సమర్ధవంతంగా పనిచేస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కొన్ని పరీక్షలను నిర్వహించడం ద్వారా రుజువు చేశారు. తమ పరిశోధనల్లో భాగంగా స్త్రీ, పురుషులపై రెండు రకాల ప్రయోగాలను నిర్వహించారు. ఈ రెండు రకాల పరీక్షల్లో భాగంగా ఎనిమిది నిమిషాల వ్యవధిలో మూడు వేరువేరు పనులను నిర్వర్తించాల్సిందిగా వారిని పరిశోధకులు కోరారు. ఈ పనులను నిర్వర్తించే సమయంలోనే ఫోన్‌కాల్స్‌ను తీసుకోవలసిన అవసరాన్ని వారికి కల్పించారు. ఒకవేళ ఈ మూడు పనులలోను నిమగ్నమైవున్న వారు ఫోన్ అంటూ తీసుకుంటే అవతలివైపునుండి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, ఎక్కడో కనబడకుండా పోయిన ఇంటి తాళాన్ని వెతకడం... ఇలాంటి పనుల్లో పురుషులతో పోలిస్తే మగువలే ఎక్కువ చాకచక్యాన్ని, సమయస్ఫూర్తిని ప్రదర్శించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.