: మన్నాడే టోపీ కథ..
మధుర గాయకుడు మన్నాడే ఇప్పుడు మనమధ్య లేకపోయినా, ఆయన పాడిన గీతాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఆయన ఆహార్యమూ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే, మన్నాడే అంటే మొదట గుర్తుకొచ్చేది ఆయన తలపై ఉండే కాశ్మీరీ టోపీయే. ఆయనకు అదెలా వచ్చిందంటారా..! ఓసారి మాంచి చలికాలంలో ఆయన కాశ్మీర్లో ప్రదర్శన ఇవ్వాల్సి వచ్చింది. అది డిసెంబర్ నెల. పైగా కాశ్మీర్. ప్రదర్శన మొదలైన కాసేపటికే మన్నాడే చలికి గజగజా వణకడం ప్రారంభించారు. ఇది చూసిన ఓ అభిమాని చలించిపోయాడు. వెంటనే తన టోపీని తీసి మన్నాడేకు ఇచ్చాడు. అది తలమీద పెట్టుకున్న ఆ మధుర గాయకుడు కాస్తంత తెప్పరిల్లారు. అనంతరం, మరింత మెరుగ్గా ఆలపించి శ్రోతలను రంజింపజేశారు. ఆనాటి నుంచి ఆ అభిమాని గుర్తుగా మన్నాడే ఆ టోపీని ధరించడం ఆనవాయతీగా మారింది.