: సచిన్ ఓ మెట్టుపైనే ఉంటాడంటున్న ఆసీస్ పేసర్
సచిన్ కు భారతదేశంలోనే కాదు, ఇతర క్రికెట్ దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఆసీస్ పేసర్ షాన్ టెయిట్ కూడా ఈ కోవలోకే వస్తాడు. సచిన్ ను ఎంతగానో అభిమానించే ఈ స్పీడ్ స్టర్ ఏమంటున్నాడో వినండి. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా కన్నా సచినే మిన్న అని కీర్తించాడు. ముంబయిలో ఓ క్రికెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న టెయిట్ మీడియాతో ముచ్చటించాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'రికీ పాంటింగ్ నాయకత్వంలో ఆడాను. బ్రియాన్ లారాకూ బౌలింగ్ చేశాను. కానీ, వారిద్దరి కంటే సచిన్ ఓ మెట్టుపైనే ఉంటాడు' అని పేర్కొన్నాడు. చివరిసారిగా సచిన్ కు 2011 ప్రపంచకప్ సందర్భంగా బౌలింగ్ చేశానని, ఆ మ్యాచ్ లో మాస్టర్ ను అవుట్ చేశానని టెయిట్ గుర్తు చేసుకున్నాడు. సచిన్ ఆ పోరులో ఫిఫ్టీ సాధించాడని, తమపై భారత్ నెగ్గిందని టెయిట్ వివరించాడు. బ్యాటింగ్ దేవుడి వికెట్ తీయడం తన కెరీర్లోనే మరుపురాని ఘటనగా మిగిలిపోతుందని అని ఈ సూపర్ ఫాస్ట్ బౌలర్ పేర్కొన్నాడు.