: వర్షాల వల్ల రాష్ట్రంలో భారీ నష్టం: చంద్రబాబు
నాలుగు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్రంలో భారీ నష్టం జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రైతులను వర్షం దెబ్బతీసిందన్నారు. 2004 నుంచి 2013 వరకు ఎనిమిది సార్లు తుపాను వస్తే.. కేంద్రం రూ.3వేల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. నీలం తుపాను బాధితులకు ఇంతవరకు పరిహారం అందలేదన్న ఆయన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. శ్రీకాకుళంలో 116 చెరువులకు గండ్లు పడ్డాయని చెప్పారు.
బాధితులను ఆదుకునేందుకు తెలుగుదేశం శ్రేణులంతా వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఈ ఉదయం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున ఆహారం, రక్షిత మంచినీరు, మజ్జిగ అందజేయాలన్నారు. అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి బాధితులకు ఉచిత వైద్యం, మందులు అందించాలని ఆదేశించారు.