: బాలీవుడ్ నటి కాజోల్ నివాసంలో బంగారం చోరీ
బాలీవుడ్ నటి కాజోల్ నివాసంలో కొద్ది రోజుల కిందట (బుధవారం) చోరీ జరిగింది. రూ.5 లక్షల విలువచేసే 17 బంగారపు గాజులను దుండగుడు ఎత్తుకుపోయినట్లు కాజోల్ దంపతులు ముంబై జూహూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 22న ఉత్తర భారతదేశంలో వివాహిత మహిళలు జరుపుకునే 'కడ్వా చౌత్' నాడు ఆభరణాల బాక్స్ తీసినప్పుడు వస్తువులు అడ్డదిడ్డంగా ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఆ గాజులను గతంలో భర్త అజయ్ బహుమతిగా ఇవ్వటంతో, కాజోల్ కు అవంటే చాలా సెంటిమెంట్ అని దగ్గరి వ్యక్తులు తెలిపారు. అటు, ఈ ఘటనపై కాజోల్ తల్లి తనూజా మాట్లాడుతూ.. దొంగతనం జరిగిందని చెప్పారు. అయితే, ఆ సమయంలో తాను వేరే చోట ఉన్నానని, ఇతర వివరాలేమీ తెలియవన్నారు. 2008 తర్వాత కాజోల్ దంపతుల ఇంట్లో ఇలా జరగటం రెండోసారి. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.