: హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మావోయిస్టుల విధ్వంసం


1997లో జరిగిన లక్ష్మణ్ పూర్ నరమేధం కేసులోని 26 మంది నిందితులను పాట్నా హైకోర్టు నిర్దోషులుగా తేల్చడంతో మావోలు ఆగ్రహంతో చెలరేగిపోయారు. ముజఫర్ పూర్ జిల్లాలో సెల్ టవర్ పేల్చివేయడంతో పాటు, ఒక బస్సుకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఎవరికీ హాని జరగలేదు. 1997 డిసెంబర్ 1న బీహార్ లోని భూస్వాములకు కొమ్ముకాసే రణవీర్ సేన సభ్యులు అర్వాల్ జిల్లాలోని లక్షణ్ పూర్ బాతేలో నరమేధం సృష్టించారు. నక్సలైట్లకు మద్దతుదారులుగా భావిస్తున్న 58 మంది దళితులను ఊచకోత కోశారు. చనిపోయిన వారిలో 27 మంది మహిళలు, 10 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి రణవీర్ సేన సభ్యుల్ని 44 మందిని అరెస్టు చేశారు.

అరెస్టయిన వారిలో 16 మందికి మరణ శిక్ష, 10 మందికి యావజ్జీవ శిక్షను విధిస్తూ పాట్నా సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే, వారందరూ నిర్దోషులేనని పాట్నా హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. కోర్టు తీర్పును నిరసిస్తూ మావోయిస్టులు 24 గంటల బంద్ కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ముజఫర్ పూర్ జిల్లాలో సెల్ టవర్, బస్సుపై దాడి చేశారు. మావోల బంద్ నేపథ్యంలో జార్ఖండ్ ను ఆనుకుని ఉన్న బీహార్ జిల్లాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. అయితే, హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళతామని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

  • Loading...

More Telugu News