: రబ్బరు సెల్లులు రానున్నాయి!
సెల్‌ఫోను అంటే కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సిన వస్తువు. అందునా స్మార్ట్ ఫోన్ అంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం చేజారి కింద పడినా ఇక దానిపై ఆశలు వదులుకోవాల్సిందే. అంత సుకుమారంగా దాన్ని చూసుకోవాలి. అలా కాకుండా రబ్బరులాంటి ఫోనుంటే... అది కిందపడ్డా కూడా ఏమీకాదు. సరిగ్గా అలాంటి ఫోన్‌లను తయారుచేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
ఆస్ట్రేలియాలోని ఆర్‌ఎంఐటీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం గట్టి సిలికాన్, సాగే గుణం కలిగిన రబ్బరు వంటి పరికరాల సాయంతో సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాలను తయారుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. భారత సంతతికి చెందిన మధుభాస్కరన్, శరత్ శ్రీరామ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా ఉన్న ఈ బృందం పారదర్శకమైన, సాగే గుణం కలిగిన ఎలక్ట్రానిక్ పరికరాలను త్వరలోనే అందుబాటులోకి తేవడానికి పరిశోధనలు చేస్తున్నారు. గట్టి సిలికాన్, సాగేగుణం కలిగిన రబ్బరు వంటి పరికరాల సాయంతో సూక్ష్మ ఎలక్ట్రానిక్ పరికరాలను అభివృద్ధి చేసి వాటితో మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేయవచ్చని ఈ శాస్త్రవేత్తల బృందం వివరించింది. ఈ విధానం గనుక విజయవంతం అయితే త్వరలోనే కింద పడినా పగలని మొబైల్ ఫోన్లు కూడా రూపొందించే వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.