: కంటిచూపుతోనే కంట్రోల్ చేయవచ్చట!
కంటి చూపుతో చంపేస్తా... అంటూ ఒక సినిమాలో హీరో డైలాగు చెబుతాడు. చంపేయడం సంగతేమోగానీ... లైటు కాంతిని కంట్రోల్ చేయవచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి కొత్త తరహా లైట్లు వచ్చాయేమో అనుకుంటున్నారా... అదేంకాదు... లైట్లు కాదుగానీ... మేకప్ సామగ్రి వచ్చింది. అంటే మీరు మేకప్ వేసుకున్న తర్వాత మీ కంటి చూపుతో లైట్లను, ఏసీ వంటి వాటిని కంట్రోల్ చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బ్రెజిల్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఒక కొత్త తరహా హైటెక్ మేకప్ సామగ్రిని రూపొందించారు. ఈ మేకప్‌ను ముఖానికి వేసుకుంటే కంటి కదలికలు, ముఖ కవళికల సంకోచ వ్యాకోచాల ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువులను నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రియోడీజెనీరోలోని పాంటిఫిసల్ క్యాథలిక్ యూనివర్సిటీకి చెందిన బ్యూటీ టెక్నాలజీ డిజైనర్ కేటీయూవెగా నేతృత్వంలో పరిశోధకుల బృందం ఈ సరికొత్త హైటెక్ అలంకరణ సామగ్రిని తయారుచేసింది.
పలుచటి లోహంతో కృత్రిమ కనువెంట్రుకలను, కనురెప్పలపై వేసుకునే రంగులను వీరు రూపొందించారు. ఇవి ఎలక్ట్రానిక్ వస్తువులతో వైర్లెస్ సర్య్కూట్ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. కనురెప్పలను, కంటి కండరాలను కొద్దిగా కదిలించినప్పుడు వీటినుండి వెలువడే సంకేతాల ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేస్తాయి. శారీరక వైకల్యంతో కదలలేనివారికోసం వీటిని రూపొందించామని, వీటిద్వారా వారు ఇతరుల సహాయం లేకుండానే సొంతంగా గృహోపకరణాలను నియంత్రించవచ్చని వెగా చెబుతున్నారు.