: గర్భిణులు దమ్ముకొడితే బిడ్డలకు చేటు
అమ్మలు పొగతాగితే తమ పిల్లలకు ప్రమాదమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గర్భంతో ఉండే మహిళలు పొగ తాగడం వల్ల వారి బిడ్డల రోగనిరోధక శక్తి తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సహజంగా గర్భంతో ఉండే మహిళలు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటే వారికి పుట్టే బిడ్డలు కూడా ఆరోగ్యకరంగానే ఉంటారు. అలాకాకుండా సరియైన ఆరోగ్యపు అలవాట్లు లేనివారికి పుట్టే బిడ్డలు కూడా పలు అనారోగ్యాల బారిన పడుతుంటారు. ముఖ్యంగా గర్భంతో ఉన్న సమయంలో పొగతాగే మహిళలకు పుట్టే బిడ్డల్లో శ్వాసకోశ తదితర ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
సాధారణంగా గర్భంతో ఉన్న మహిళల్లో పొగతాగని తల్లులతో పోలిస్తే దమ్ముకొట్టే తల్లులకు పుట్టిన శిశువుల్లో 50 శాతం దాకా ఏదో ఒక ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన వ్యాధులతో ఆసుపత్రుల పాలుకావడం, లేదా మరణించడం జరుగుతోందని పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు. తమ అధ్యయనంలో భాగంగా వీరు 1987 నుండి 2004 మధ్య 50 వేలమంది శిశువులకు సంబంధించిన ఆసుపత్రి రికార్డులను, మరణ ధృవీకరణ పత్రాలను పరిశీలించారు.
గర్భంతో ఉన్న సమయంలో పొగతాగే మహిళలకు జన్మించిన శిశువులు తక్కువ బరువుతో పుట్టడం, నెలలు నిండకుండా పుట్టడం, ఊపిరితిత్తులు సరిగా ఎదగకపోవడం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందనే విషయం ఎప్పటినుండో తెలిసినదేనని ఈ పరిశోధనలో పాల్గొన్న అబిగెయిల్ హాల్పెరిన్ చెబుతున్నారు. ఇలాంటి శిశువుల్లో శ్వాసకోశ సంబంధ ఇన్‌ఫెక్షన్లు సర్వసాధారణమని, కొన్నిసార్లు ఇలాంటి వారికి ప్రాణాంతక వ్యాధులు కూడా వస్తున్నట్టు తాజా పరిశోధనలో తేలిందని హాల్పెరిన్ చెబుతున్నారు.