: మన వలసలు ఎలా ప్రారంభమయ్యాయంటే...
ఆది మానవుడు ఎక్కడినుండి వచ్చివుంటాడు... ఈ విషయంపై శాస్త్రవేత్తలు విభిన్న అభిప్రాయాలను వెలిబుచ్చారు. మానవుడు ఆఫ్రికానుండి వలసలను ప్రారంభించి వుంటాడని, లేదా ఇతర ప్రాంతాలనుండి వలసలను ప్రారంభించి ఉంటాడని పలువురు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే మానవ వైరస్‌కు సంబంధించిన జన్యుపరమైన అంశాలపై నిర్వహించిన అధ్యయనంలో మానవుడు ఆఫ్రికా నుండి తన వలసలను ప్రారంభించినట్టు తేలింది.
విస్కాన్సిస్ వర్సిటీకి చెందిన సీనియర్ అధ్యయనకర్త కర్టిస్ బ్రాండ్ ప్రమాదకరం కాని హెచ్ఎస్వీ-1 వైరస్‌పై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ విషయాలను గురించి బ్రాండ్ చెబుతూ తమ అధ్యయనంలో భాగంగా ఉత్తర అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలనుండి సేకరించిన 31 హెచ్ఎస్వీ-1 వైరస్ భాగాలను పోల్చి చూసినట్టు తెలిపారు. మానవ విశ్వజన్యురాశి ఆధారంగా చూసినప్పుడు ఆఫ్రికా నుండి సేకరించిన వైరస్ భాగాల సమూహాలన్నీ ప్రత్యేకంగా కలిసున్నాయని, కొరియా, జపాన్, చైనాలనుండి సేకరించినవి సమూహంగా ఉన్నాయని తెలిపారు. ఐరోపా, అమెరికా వైరస్‌లన్నీ సమూహంగా ఉన్నాయని బ్రాండ్ తెలిపారు. అయితే మానవుల మూలాలు ఎక్కడున్నాయి, అవి ఎలా వ్యాపించాయి? అనే విషయాల్లో మానవశాస్త్రవేత్తలు చెప్పిన అంశాలే కచ్చితంగా తమ అధ్యయనంలో కూడా గుర్తించామని, తమ పరిశోధనా ఫలితాలు మానవ శాస్త్రవేత్తల, ఇతర జన్యుపరమైన సమాచారానికి మద్దతిచ్చేలా ఉన్నాయని బ్రాండ్ తెలిపారు.