: ఎక్కువ మార్కులు కావాలా?.. ఇలా చేయండి..
క్లాసులో ఎప్పుడూ ఫస్టు ర్యాంకు రావాలా? అయితే వెంటనే వ్యాయామం మొదలు పెట్టండి. టీనేజ్ లో ఉన్న అమ్మాయిలు ప్రతిరోజూ కొంత వ్యాయామం చేస్తే సైన్సులో మంచి మార్కులు వచ్చే అవకాశముందని ఓ పరిశోధనలో తేలింది. వ్యాయామం ఎంత ఎక్కువగా చేస్తే అంత ప్రభావం ఉంటుందని పరిశోధకులు తెలిపారు. 5 వేల మంది విద్యార్థులపై పరిశోధన చేసిన తరువాతే పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. 1991,1992 మధ్య ఇంగ్లండ్ లో పుట్టిన 14 వేల మంది విద్యార్థుల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని నిర్థారించారు. యాక్సెలరో మీటర్ అనే పరికరాన్ని అమర్చి మూడు నుంచి ఎనిమిది రోజుల వరకు వ్యాయామాల తీరు లెక్కించారు. తరువాత ఇంగ్లీష్, లెక్కలు, సైన్సు సబ్జెక్టులలో మార్కులు చూశారు. సైన్సులో మార్కుల పెరుగుదల గమనించారు. ముఖ్యంగా, అమ్మాయిల్లో మరింత పెరుగుదల కనిపించింది. అదీ సంగతి..! అమ్మాయిలూ మరెందుకాలస్యం, వ్యాయామం ఇప్పుడే మొదలు పెట్టండి.. సైన్సులో మంచి మార్కులు సాధించండి.