: అమెరికా పాఠ్యాంశాల్లోకి మలాలా
పాక్ బాలిక మలాలా దినదిన ప్రవర్థమానమై బాలికల విద్యా హక్కు కిరణంలా ప్రకాశిస్తోంది. గతేడాది తాలిబాన్ల కాల్పుల నుంచి ప్రాణాలతో బయటపడ్డ తర్వాత మలాలాకు అంతర్జాతీయంగా ప్రచారం పెరిగిపోయింది. నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ అయి ఆశ్చర్యపరిచింది. అమెరికా అధ్యక్షుడు, బ్రిటన్ రాణినీ కలుసుకుంది. తాజాగా 'నేను మలాలా' అనే పుస్తకంతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో మలాలా తన అనుభవాలను పొందుపరిచింది. పాకిస్థాన్ లోని స్వాత్ లోయకు, ఎంతో అభివృద్ధి చెందిన బ్రిటన్ కు మధ్య తాను చూసిన తేడాను చక్కగా అభివర్ణించింది. బాలికలకు చదువే సర్వస్వం అని చెప్పింది.
ఇప్పుడు ఈ పుస్తకంలోని మలాలా అనుభవాలను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నిర్ణయించింది. బాలికా విద్య కోసం మలాలా చేస్తున్న సాహసోపేత ఉద్యమం ఇతరులకు స్ఫూర్తినిస్తుందని వాషింగ్టన్ యూనివర్సిటీ గ్లోబల్ ఉమెన్స్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ మేరీ ఎల్స్ బెర్గ్ చెప్పారు.