: విభజన జరిగిపోయిందనే ప్రచారాన్ని మంత్రులు మానుకోవాలి: అశోక్ బాబు
కేంద్ర మంత్రులు, ఎంపీలు రాష్ట్ర విభజన జరిగిపోయిందంటూ చేస్తున్న ప్రచారాన్ని మానుకోవాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సూచించారు. కొంతమంది నాయకులు రాజీనామాలు చేయకుండా... విభజన జరిగిపోయిందని అంటున్నారని విమర్శించారు. దీని వల్ల ప్రజల్లో నిరుత్సాహం తలెత్తుతుందని అన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తలచుకున్నంత మాత్రాన రాష్ట్ర విభజన జరిగిపోయినట్టేనా? అని అన్నారు. తీర్మానం రాష్ట్ర అసెంబ్లీకి వచ్చి తీరాల్సిందేనని అశోక్ బాబు డిమాండ్ చేశారు. అసెంబ్లీ, పార్లమెంటులలో రాష్ట్ర విభజన తీర్మానాన్ని అడ్డుకోవాలని తెలిపారు.
రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి అన్ని పార్టీలు సమైక్యాంధ్ర కోసం పనిచేయాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న అన్ని పార్టీల మద్దతును కూడగట్టుకుని పార్లమెంటులో తెలంగాణను అడ్డుకోవాలని సూచించారు. దేశ చరిత్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఎదుర్కొన్న సంక్లిష్ట పరిస్థితులు మరే ఉద్యమం ఎదుర్కోలేదని తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లా, మండల స్థాయిల్లో సమైక్య సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. ఇరుప్రాంత ప్రజలను యూపీఏ మోసం చేస్తోందని అశోక్ బాబు ఘాటుగా విమర్శించారు.