: ఏటీఎం కోసం ఒడిశా నుంచి ఆంధ్రాకు
పైలిన్ తుపాను కారణంగా ఒడిశా వాసులు పలు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. కనీసం నగదు డ్రా చేసుకుందామంటే ఏటీఎంలు పనిచేయని పరిస్థితి నెలకొంది. దీంతో ఒడిశాలోని బరంపురం వాసులు ఏటీఎంల కోసం సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. తుపాను తాకిడికి బరంపురం పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దానికితోడు, సాంకేతిక సమస్యలతో ఏటీఎంలు పనిచేయడం మానేశాయి.
పట్టణంలో ఎస్ బీఐ ఏటీఎం ఒక్కటే పనిచేస్తోంది. అక్కడ కిలోమీటర్ల మేర క్యూ ఉండడంతో.. చేసేది లేక అక్కడి వారు బస్సెక్కి ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుని తిరిగి వెళుతున్నారు. క్యూలో నిల్చునే బదులు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని ఇచ్ఛాపురంకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకుని రావడానికే తాను ప్రాధాన్యం ఇస్తానని బరంపురం వాసి శ్రీనివాసరావు చెప్పాడు. ముఖ్యంగా తెలుగు మాట్లాడేవారు ఆంధ్రాకు వెళ్లి ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకుని, మొబైల్ రీచార్జ్ చేసుకుని వస్తున్నారని ఆంధ్రాబ్యాంకు అధికారి ఒకరు తెలిపారు.