: నిజమైన చిట్టి వచ్చేశాడు!
రోబో సినిమాలో చిట్టి గుర్తున్నాడు కదా... అందులో వశీకర్ సృష్టించిన చిట్టి చక్కగా మనలాగే ఆలోచిస్తాడు, మాట్లాడతాడు... ఇవన్నీ గుర్తున్నాయికదా... సరిగ్గా ఇలాగే ఆలోచించి, మాట్లాడే ఒక రోబోను శాస్త్రవేత్తలు సృష్టించారు. ఈ రోబో అచ్చు మనిషిలాగే ఉండడమేకాదు మనిషికి ఉన్నట్టే కాళ్లు, చేతులు, ముఖం, గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలను కలిగివున్నాడు. చీలమండలం, వేళ్లు, మణికట్టూ అన్నీ కదులుతాయి. గుండె కూడా చక్కగా కొట్టుకుంటుంది. ఊపిరితిత్తులు, క్లోమం, ప్లీహం, మూత్రపిండాలు వంటివి కూడా ఉన్నాయి. మనలోలాగే ఈ రోబోలో కూడా రక్తం ప్రవహిస్తుందట. ఒక్క పేగులు, కాలేయం, జీర్ణాశయం వంటి క్టిష్టమైన అవయవాలు మినహా మిగిలిన అవయవాలను అన్నింటినీ ఈ రోబోలో శాస్త్రవేత్తలు అమర్చారు.
అవయవాలన్నీ కృత్రిమమైనవే అయినా కూడా మనలాగే ఉండేలాంటి రోబో మనిషి (బయోనిక్ మ్యాన్)ని శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఇంగ్లండ్‌లోని 'షాడో రోబోట్ ' కంపెనీకి చెందిన రిచ్ వాకర్, మాథ్యూ గాడెన్‌లు దీనికి రూపాన్నిచ్చారు. ఈ రోబోకు స్విట్జర్లాండులోని యూనివర్సిటీ ఆఫ్ జూరిచ్‌కు చెందిన బెర్టోల్ట్ మేయర్ అనే ప్రొఫెసర్ ముఖాన్ని పోలినట్టుగా ఉండేలా ఈ రోబో మ్యాన్ ముఖాన్ని తయారుచేశారు. ఎందుకంటే ఆయన అత్యాధునికమైన కృత్రిమ చేతులతోనే తన పనులను చేసుకుంటున్నారు. దీని తయారీకి మిలియన్ డాలర్ల వరకూ ఖర్చయిందట. వాషింగ్టన్‌లోని స్మిత్ సోనియన్స్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో త్వరలోనే దీన్ని ప్రదర్శనకు ఉంచనున్నారట.