: ఐన్‌స్టీన్ సిద్ధాంతంలో తప్పుందట!
ఐన్‌స్టీన్ ప్రపంచంలో మహామేధావిగా అందరికీ సుపరిచితమే. ఆయన కనుగొన్న సిద్ధాంతాలు ఎందరో శాస్త్రవేత్తలకు ఆధారమయ్యాయి. అయితే ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతంలో తప్పుండే అవకాశం ఉంటుందా... అంటే ఉందనే చెబుతున్నాయి ఆధారాలు. ఎందుకంటే తన తప్పును అంగీకరిస్తూ ఐన్‌స్టీన్ తన శిష్యుడికి ఓ లేఖ రాశాడు.
కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేస్తున్న సమయంలో హెర్బర్ట్ సాల్జర్ అనే విద్యార్ధి 1938లో ఐన్‌స్టీన్‌కు ఒక లేఖ రాశాడు. ఇందులో ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన దూర సమాంతర క్షేత్ర సిద్ధాంతం (డిస్టెంట్ పారలిజం ఫీల్డ్ థియరీ)లో తప్పును కనుగొని ఆయనకు లేఖ రాశాడు. ఈ లేఖకు ఐన్‌స్టీన్ రెండుసార్లు సాల్జర్‌కు బదులిచ్చారు. 1938 ఆగస్టు 29న తొలుత బదులిస్తూ సాల్జర్ ప్రతిపాదన సాధ్యం కాదని చెప్పారు. రెండు వారాల తర్వాత తన తప్పును అంగీకరిస్తూ మళ్లీ సాల్జర్‌కు మరో లేఖ రాశారు. అందులో తనదే తప్పని ఐన్‌స్టీన్ అంగీకరించారు. సాల్జర్‌కు ఐన్‌స్టీన్ రాసిన రెండు ఉత్తరాలను నవంబర్ 17న న్యూయార్క్‌లోని గ్యుయెర్సీస్ యాక్షన్ హౌస్‌లో వేలం వేయబోతున్నారు. ఐన్‌స్టీన్ రాసిన లేఖలు కాబట్టి ఇవి భారీ ధర పలికే అవకాశం ఉందని వేలం నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ లేఖలకు వేలం నిర్వాహకులు రూ.2 కోట్ల 43 లక్షల ధర నిర్ణయించే అవకాశం ఉంది.