: విభజించు, పాలించు విధానమే కాంగ్రెస్ అజెండా : నరేంద్ర మోడీ
గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ శుష్క వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తోందని నరేంద్ర మోడీ విమర్శించారు. దేశమంతటా బీజేపీకి ఎనలేని ఆదరణ వ్యక్తమవుతోందని అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగిన భారీ ర్యాలీలో మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ ఎన్నో వాగ్దానాలు చేస్తుంది కానీ... ఒక్కటీ నెరవేర్చదని అన్నారు. ఆహార భద్రత పేరుతో మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పిల్లలకు ఇచ్చే ఆహారం కంటే తక్కువగా పెద్దవారికి ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని ఎద్దేవా చేశారు. బంగారు పళ్ళెంలో తినేవారికి పేదల ఆకలి గురించి ఏం తెలుస్తుందని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ మోడీ వ్యాఖ్యానించారు.
ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తామని 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని... కానీ ధరల నియంత్రణకు మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. ఆకాశాన్నంటిన ధరలపై సోనియా కాని ఆమె కుమారుడు రాహుల్ కానీ ఏనాడైనా విచారాన్ని వ్యక్తం చేశారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు పేదల కోసం పాటుపడాలని మోడీ సూచించారు.
ఉత్తరప్రదేశ్ ను ఎస్పీ, బీఎస్పీ నాశనం చేశాయని ఘాటుగా విమర్శించారు. గుజరాత్ లో అన్ని వర్గాల వారికీ అభివృద్ధి ఫలాలు అందాయని తెలిపారు. దేశంలో ఉన్న అన్ని మతాల వారు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. బ్రిటీష్ వారినుంచి నేర్చుకున్న విభజించు, పాలించు విధానంతో కాంగ్రెస్ ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని నరేంద్ర మోడీ ఆరోపించారు