: ఢిల్లీ చిన్నారుల్లో 4 శాతం మందికి హై బీపీ
ఆధునిక రోజులు, పెరుగుతున్న నగరీకరణ మనిషి జీవనాన్ని ఎంత అనారోగ్య మయం చేస్తున్నాయో చెప్పేందుకు ప్రబల ఉదాహరణ ఒకటి బయటపడింది. దేశ రాజధాని ఢిల్లీలో 3 నుంచి 4 శాతం చిన్న పిల్లలలో హైపర్ టెన్షన్ ఉన్నట్లు ఎయిమ్స్ వైద్యుల పరిశోధనలో తేలింది. కేంద్రీయ విద్యాలయాలు, మునిసిపల్ స్కూళ్లలో చదువుకునే తక్కువ, మధ్యాదాయ వర్గాలకు చెందిన 10 వేల మంది చిన్నారులపై ఈ అధ్యయనం జరిగింది.
ఆహార పరమైన నియంత్రణలు, శారీరక శ్రమ లేకుంటే ఈ చిన్నారులు బీపీ బాధితులుగా మారిపోతారని అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్ ఉమేష్ కపిల్ చెబుతున్నారు. వీరి అధ్యయన ఫలితాలు ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండ్రొకైనాలజీ అండ్ మెటబాలిజం తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. హైపర్ టెన్షన్ గుండె సంబంధిత సమస్యలకు కారణవుతుంది. ఎక్కువ శాతం హార్ట్ ఎటాక్ మరణాలకు బీపీయే కారణం. ఉప్పు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ ను మానేసి, శారీరక శ్రమ చేయాలని డాక్టర్ ఉమేష్ సూచిస్తున్నారు. అధిక బరువుతో వచ్చే సమస్యలు, పోషకాహారంపై అవగాహన లేకపోవడం చిన్నారులలో బీపీకి కారణంగా చెబుతున్నారు.