: మలయాళ సంగీత దిగ్గజం కే రాఘవన్ అస్తమయం
తన సంగీతంతో మలయాళ చిత్రసీమకు స్థానిక పరిమళాలు అద్దిన గొప్ప సంగీత దర్శకుడు కే రాఘవన్ ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 99 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కొన్ని రోజుల క్రితం కేరళలోని తలసెరిలో ఒక ఆస్పత్రిలో చేర్చించగా ఈ ఉదయం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానులు, సహచరులకు రాఘవన్ మాస్టర్ గా ఆయన సుపరిచితులు.
1950లో నీలక్కుయిల్ చిత్రానికి తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించారు. ఆ చిత్రంలోనే ఒక పాటను కూడా పాడారు. నిర్మల్యం, ఉత్తరాయనం, నాగరమెండి, ఉన్నియర్చ, రామనన్, కల్లిచెల్లమ్మ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు పని చేశారు. 400 సినిమాలకు సంగీతం అందించారు. ఎక్కువ శాతం పీ భాస్కరన్ తో కలిసి పనిచేశారు. ఆల్ ఇండియా రేడియా కళాకారుడిగా కూడా పనిచేశారు. పద్మశ్రీ, కేరళ ప్రభుత్వ అత్యున్నత సినీ పురస్కారం జేసీ డేనియెల్ అవార్డులు ఆయనకు దక్కాయి. ఐదు దశాబ్దాలుగా మలయాళ చిత్ర పరిశ్రమకు సంగీత సేవ చేసిన రాఘవన్ మాస్టారు లేరని తెలిసి చిత్ర పరిశ్రమ కలత చెందింది. సంతాపం వ్యక్తం చేసింది.