: హైదరాబాద్ లేని రాష్ట్రం భర్త లేని భార్య వంటిది : ఎంపీ మోదుగుల
కేంద్ర మంత్రుల బృందంపై తెదేపా ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ బృందం వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదని కుండబద్దలు గొట్టారు. ఈ బృందానికి ఏం చెప్పినా ఉపయోగం లేదని... చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టేనని విమర్శించారు. సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరించాకే విభజనపై ముందుకు వెళ్లాలని... అంతవరకు విభజన ప్రక్రియను చేపట్టరాదని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు శాసనసభ తీర్మానాన్ని తప్పనిసరి చేయాలని అన్నారు. హైదరాబాద్ లేని రాష్ట్రం భర్త లేని భార్య వంటిదని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మోదుగుల ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు సాయంత్రం జరిగే కేంద్ర మంత్రుల బృందం సమావేశాన్ని అడ్డుకుని తీరుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ ఎంపీలు కూడా కలసి రావాలని అన్నారు. సోనియా గాంధీ వద్ద గొంతెత్తే దమ్ము, ధైర్యం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలకు లేదని మోదుగుల దుయ్యబట్టారు.