: మీ విలువ తగ్గించుకోకండి
ఆడవారు ఎంతటి విజయాన్ని సాధించినా నమ్రతగా ఒదిగే ఉంటారు. ఇలా ఒదిగి ఉండడం అనేది ఆడవారికి నిండుదనాన్ని ఇస్తుందేమోగానీ, కెరీర్ పరంగా వారిని మాత్రం వెనక్కి నెడుతుంది. ఇది చాలామందికి తెలియదు. ఇప్పుడు చాలా కంపెనీల్లో ఉన్నత విభాగాల్లో మహిళలే ఉన్నత పదవులను నిర్వహిస్తూ కంపెనీ లాభాల బాటలో పయనించడానికి తోడ్పడుతున్నారు. వారు సాధించిన విజయాన్ని గురించి వారిని ప్రశంసిస్తే ఆ విజయం తమది కాదని, ఫలానా దానివల్ల సాధించగలిగామని వారు తాము సాధించిన విజయాన్ని వేరొకరికి ఆపాదించేస్తారట. ఇలా చేయడం వల్ల వారు తమ అవకాశాలను చాలా వరకూ కోల్పోతారట. అంతేకాదు ఇలా చేయడం వల్ల వారిలో ఆత్మన్యూనత భావం మరింతగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పురుషులతో పోల్చుకుంటే మహిళలకు ఇచ్చే పారితోషికం చాలా తక్కువ. మగవారితో సమానంగా పనిచేస్తున్నా వారికి ఇచ్చే వేతనంలో కేవలం 70 శాతం మాత్రమే మగువలకు ఇస్తున్నారట. ఇంటా బయటా విజయాన్ని సాధిస్తూ ముందుకెళుతున్నా ఉద్యోగినులు ఇంటా బయటా ఎదురవుతున్న మానసికపరమైన ఒంటరితనంతోనే కీలక బాధ్యతల నుండి తప్పుకుంటున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. కాబట్టి మగువలు ధైర్యంగా తాము సాధించిన విజయాన్ని తమదిగా అంగీకరించండి, అలాగే ఇంటా బయటా పనులతో సతమతమవకుండా, పని వత్తిడిని కాస్త తగ్గించుకుని తమ కుటుంబానికి కూడా తగు సమయం కేటాయిస్తూ ముందుకు వెళితే మరిన్ని విజయాలు మీ సొంతమవుతాయి.