: నా భర్త నుంచి కాపాడండి..ఓ ఏన్నారై భార్య ఆక్రందన
వరకట్న పిశాచుల నుంచి కాపాడాలంటూ ఓ ఎన్నారై భార్య మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. అదనపు కట్నంకోసం వేధింపులకు గురి చేస్తూ, తనపై హత్యాయత్నం చేస్తున్న ఎన్నారై భర్త, అత్తమామల నుంచి తనను, కుమార్తెను, తల్లిదండ్రులను రక్షించాలని కోరుతూ నేరేడ్ మెట్ ప్రాంతానికి చెందిన టెక్కీ శిరీషా రెడ్డి.. హెచ్చార్సీ చైర్మన్ కాకుమాను పెదపేరిరెడ్డిని కలిశారు. బిరుదురాజు ఉదయ్, తాను ఏడేళ్లక్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, పెళ్లి సందర్భంగా తమ తల్లిదండ్రులు ఉదయ్ కు వరకట్నంగా 10 లక్షల రూపాయలు చెల్లించారని తరువాత తామిద్దరం ప్రాజెక్టు పనిమీద అమెరికాలోని న్యూజెర్సీకి వెళ్లిపోయామని చెప్పింది.
అయితే పురిటికి తనను హైదరాబాద్ పంపించారని ఇప్పుడు ఎల్ బీ నగర్ నాగోల్ ప్రాంతంలో ఉంటున్న ఉదయ్, ఆయన కుటుంబసభ్యులు 20 లక్షలు అదనపు కట్నం తేవాలంటూ తనను వేధిస్తున్నారని, ఇందుకు తాను నిరాకరించడంతో తనను ఇంట్లోంచి గెంటేశారని తెలిపింది. తనను, కుమార్తెను అడ్డుతొలగించుకునేందుకు భర్త, అత్తమామలు కుట్రపన్నారని, ఇటీవల తనపై హత్యాయత్నం కూడా చేశారని కన్నీటిపర్యంతమైంది.
దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పింది. హక్కుల కమిషన్ జోక్యం చేసుకుని తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరింది. దీంతో వారికి రక్షణ కల్పించాల్సిందిగా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పెదపేరిరెడ్డి ఎల్ బీ నగర్ ఏసీపీకి బాధ్యత అప్పగిస్తూ, ఘటనపై సమగ్ర నివేదిక నవంబర్ 21 లోగా సమర్పించాలని ఆదేశించారు.