: ముఫ్ఫై ఏళ్లకల్లా పిల్లలుండాలట!
ముఫ్ఫై ఏళ్లకల్లా పిల్లలు పుట్టాలట. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండడంతోబాటు పిల్లల ఎదుగుదల పట్ల కూడా మనం శ్రద్ధ చూపేందుకు వీలవుతుందట. అలా కాకుండా వయసు మీరిన తర్వాత పిల్లలు పుట్టడం వల్ల, ఆ పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండడం తక్కువ, అలాగే వయసు మీరిన తర్వాత ఇటు మహిళల్లో కూడా సంతాన సామర్ధ్యం తక్కువవుతుందట. కాబట్టి ముఫ్ఫై ఏళ్లకు ముందే పిల్లలను కనే విషయం గురించి ఆలోచిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడు ఎక్కువగా ఉన్నత చదువు, కెరీర్‌లో ఎదుగుదల అంటూ చాలామంది అమ్మాయిలు వివాహం చేసుకోవాలనే ధ్యాసనుండి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారు పాతికేళ్లకే పిల్లల గురించి ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, భారతీయ మహిళలకు పిల్లల్ని కనే సామర్ధ్యం ముఫ్ఫై ఏళ్లకే తగ్గుతోందని తాజాగా నిర్వహించిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
పాశ్చాత్య దేశాల్లోని మహిళలకు నలభై ఏళ్లు వచ్చిన తర్వాత కూడా వారి అండాశయాల తీరు చక్కగా ఉందని, కానీ భారతీయ మహిళల్లో ముఫ్పై ఏళ్లకే అండాశయాల పనితీరు తగ్గుతోందని ఈ సర్వేలు చెబుతున్నాయి. ముఫ్ఫైఏళ్లు దాటిన మహిళల్లో ఎక్కువమంది ఐవీఎఫ్ చికిత్సని ఆశ్రయించి సంతానాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నట్టు, ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలోనే ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. పోషకాహార లోపం, తగు వ్యాయామం లేకపోవడం వంటి పలు కారణాల వల్ల మగువల్లో సంతాన సామర్ధ్యం తగ్గుతోందని, కాబట్టి యుక్త వయసు నుండే ఆడపిల్లలకు సరైన పోషకాహారం అందివ్వడంతోబాటు చక్కటి వ్యాయామం చేసేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.