: చరిత్రహీనులుగా మిగిలిపోకండి: కిరణ్, బాబులకు జగన్ హితవు
ప్రజల ఆకాంక్షలను ఇకనైనా గుర్తెరిగి సమైక్యవాదానికి మద్దతివ్వాలని ముఖ్యమంత్రి కిరణ్, విపక్ష నేత చంద్రబాబులకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ సూచించారు. లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. విభజన జరిగితే పిల్లల భవిష్యత్తు కోల్పోతారని.. అప్పుడు కిరణ్, చంద్రబాబులను ప్రతి ఒక్కరూ తిట్టుకుంటారని అన్నారు. సీఎం కిరణ్ ఒక్కో విభాగాన్నే ఉద్యమం నుంచి తప్పిస్తూ ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని ఆరోపించారు. సీఎం వైఖరిని నిరసిస్తూ తమ పార్టీ ఎమ్మెల్యేలు ఆయన ఇంటి ఎదుట ధర్నా నిర్వహిస్తారని తెలిపారు. ఇక, ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు ఏం చేశారని జగన్ ప్రశ్నించారు. ఇప్పటికైనా టీడీపీ కళ్ళు తెరిచి సమైక్యం కోసం పోరాడాలని సూచించారు.
ఇక, కేంద్రమంత్రులు సమైక్యవాదాన్ని పక్కనబెట్టి ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం సమైక్యంగా లేకుంటే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఎడారిగా మారుతుందని చెప్పారు. మొదటి నుంచి సమైక్యానికి బాసటగా నిలిచింది వైఎస్సార్సీపీ, సీపీఎం, ఎంఐఎం మాత్రమే అని పునరుద్ఘాటించారు. తమ రోదన అరణ్యరోదనే అయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. విభజన అంశంపై కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.