: ఇదే ఒరవడి కొనసాగిస్తా: రోహిత్
జైపూర్ వన్డేలో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తులోనూ ఇదే ఒరవడి కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఇది ఆరంభం మాత్రమే అని, ఇక్కడితో తన దూకుడు ఆగదని స్పష్టం చేశాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, టీమిండియాకు ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం రావడం మహత్తర బాధ్యతగా భావిస్తున్నానని తెలిపాడు. పునాది వేయడమే తన కర్తవ్యమని అన్నాడు. తాను సెంచరీ చేయడం కన్నా జట్టు విజయం సాధించడమే సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ నిన్నటి మ్యాచ్ లో 123 బంతుల్లోనే 141 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రోహిత్ స్కోరులో 17 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. ఇక, తోటి ఓపెనర్ శిఖర్ ధావన్ పైనా రోహిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. శిఖర్ తన సహజసిద్ధమైన ఆటతీరు కనబర్చాడని కితాబిచ్చాడు. ముఖ్యంగా కోహ్లీ ఇన్నింగ్స్ అమోఘమని చెప్పాడు. కోహ్లీ ఆడిన షాట్లు మ్యాచ్ ను ఆసీస్ కు దూరం చేశాయని అన్నాడు.