: బెజవాడలో జంటహత్యలు.. కొన్ని గంటల్లోనే ఛేదించిన పోలీసులు
విజయవాడలో ఈ తెల్లవారుజామున జరిగిన జంటహత్యలు సంచలనం సృష్టించగా, కొద్ది గంటల్లోనే పోలీసులు ఆ మిస్టరీని ఛేదించారు. వివరాల్లోకెళితే.. తాడంకి వీధిలో నివాసముండే సత్యనారాయణకు ఇద్దరు కుమారులు. సత్యనారాయణ బంగారం వ్యాపారం చేస్తుంటాడు. కుమారులిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. దసరా పండుగ సందర్భంగా కుమారులు బంధువుల ఊరెళ్ళారు. ఇంట్లో సత్యనారాయణ భార్య పుణ్యవతి, రెండవ కుమారుడి తనయ చంద్రిక ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన ఓ కిరాతకుడు వారిద్దరినీ అతి పాశవికంగా హత్య చేసి నగదు, నగలు దోచుకున్నాడు.
ఈ రెండు హత్యలు తీవ్ర కలకలం రేపడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎనిమిది గంటల వ్యవధిలోనే మిస్టరీ ఛేదించారు. లిఫ్ట్ మెకానిక్కే ఈ దారుణానికి ఒడిగట్టాడని గుర్తించారు. దీంతో, అతడిని అదుపులోకి తీసుకుని 'తమదైన శైలి'లో ప్రశ్నిస్తే నిజాలు కక్కాడు. డబ్బు కోసం పుణ్యవతిని చంపానని, సాక్ష్యం లేకుండా చేసేందుకే చంద్రికను చంపానని గుట్టు విప్పాడు.