: నేనేం కీలుబొమ్మను కాను: మలాలా
పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ (16) తానేమీ పాశ్చాత్య దేశాల చేతిలో కీలుబొమ్మను కానని స్పష్టం చేసింది. ఇస్లాంను వీడి లౌకికవాదం దిశగా పరుగులు తీస్తోందన్న ఆరోపణలపై మలాలా బదులిచ్చింది. పాకిస్థానీ అని చెప్పుకోవడానికి తాను గర్వపడుతున్నానని వెల్లడించింది. బీబీసీకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ ప్రజలు తనకు మద్దతిస్తున్నారని పేర్కొంది. తనపై కాల్పులు జరిగిన తర్వాత రోజున ప్రజలు.. 'అయామ్ మలాలా' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు కానీ, 'అయామ్ తాలిబాన్' అంటూ ప్లకార్డులు చేతబట్టుకోలేదని పరోక్షంగా మతఛాందసులకు చురకంటించింది.
గతేడాది అక్టోబర్ లో ఆమెపై పాకిస్థాన్ స్వాత్ లోయలో తాలిబాన్లు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మలాలా లండన్ లో చికిత్స పొంది కోలుకుంది. ప్రస్తుతం ఆమె అక్కడే ఉంటోంది. భవిష్యత్ లో పాక్ ప్రధానిగా ఎన్నికవ్వాలని ఉందని మలాలా తన మనసులో మాట చెప్పగా.. మలాలా ఈసారి తమనుంచి తప్పించుకోవడం అసాధ్యమని తాలిబన్లు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే ఈ సాహస బాలిక విఖ్యాత యూరోపియన్ పురస్కారం 'సఖరోవ్ శాంతి బహుమతి'కి ఎంపికైంది. నోబెల్ శాంతి పురస్కారం లభించకపోయినా, నామినీగా ఆమెకు విశేష ప్రాచుర్యం లభించింది.