: ఈ గొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు
వర్షానికి వేసుకునే గొడుగులు ఆరోగ్యానికి మేలెలా చేస్తాయి అనుకుంటున్నారా... అదేంకాదులెండి. ఇవి పుట్టగొడుగులు. నాన్వెజ్ తినడం ఇష్టం లేనివారు వీటిని చక్కగా తినవచ్చు. పుట్టగొడుగుల్లో అత్యధిక పోషకవిలువలున్నాయి. చక్కటి రుచితోబాటు పోషకవిలువలను కలిగివుండడంతో చాలామంది వీటిని ఇష్టపడతారు. అంతేకాదు, వీటిలో జీరో కొలెస్టరాల్ ఉంటుంది. దీంతో వీటిని ఎక్కువగా తిన్నా కూడా మన శరీరానికి ఎలాంటి హాని జరగదని నిపుణులు చెబుతుంటారు. ఇవి తక్కువ కార్బొహైడ్రేట్లను కలిగివుండడంతోబాటు ప్రోటీన్లు, విటమిన్లు, నీరు, ఫైబరు పుష్కలంగా కలిగివుంటాయి.
మన శరీరంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణాన్ని ఇవి కలిగివున్నాయి. దీంతో శరీరంలో చక్కెర నిల్వలు పెరగడం అనేది ఉండదు. కాబట్టి షుగరువ్యాధిగ్రస్థులకు ఇవి చాలా మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచే గుణం వల్ల వీటిని ఎవరైనా తీసుకోవచ్చు. వీటిద్వారా విటమిన్ డి పుష్కలంగా మన శరీరానికి అందుతుంది. వీటిలో కాల్షియం, ఐరన్, పొటాషియం, కాపర్లు కూడా మన శరీరానికి చాలినంత లభిస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి కూడా వీటికి వుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుందట.