: మీ గుండెను ఇలా కాపాడుకోండి


మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అన్నది మన చేతుల్లోనే వుంది. ఇందుకు మనం చేయాల్సిందల్లా మనం తీసుకునే ఆహారంలోను, చేసే వంటకాల్లోను చిన్న పాటి మార్పులు చేయడమే. రోజూ బోలెడంత నూనె వేసి పోపులు పెట్టిన వంటకాలను తినడం చాలామందికి ఇష్టం. వంటలకు పోపుల వల్ల రుచి పెరుగుతుంది. దీంతో బోలెడంత నూనెవేసి పోపులు పెడితే ఆ వంటకం ఘుమఘుమలాడిపోతుంది. అలాగే ఉప్పును కూడా వంటల్లో సరిపడేంత వేసుకుని తింటాం. కొందరైతే కాస్త ఎక్కువే ఉప్పు వేసుకుంటారు. ఈ రెండింటినీ మన వంటల్లో తగ్గించుకోవడం వల్ల మన గుండెను భద్రంగా కాపాడుకున్నవాళ్లమవుతాం.

నూనెలు, కొవ్వు పదార్ధాలు, ఉప్పు సాధారణ స్థాయికి మించి వాడడం వల్ల ఎక్కువమంది గుండెజబ్బులకు గురవుతున్నారని తాజా సర్వేలో తేలింది. వీటిని ఎక్కువగా వాడడం వల్ల అనారోగ్యానికి గురవుతారని, గుండె జబ్బులు, రక్తపోటు, షుగరు వ్యాధి వంటివాటికి గురవుతారని తేలింది. ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు మన రోజువారీ వంటకాల్లో రోజుకు 400 గ్రాముల పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకుంటే మంచిదని భారత ప్రజారోగ్య సంస్థ రూపొందించిన నివేదిక చెబుతోంది.

అయితే ఈ నివేదికకు విరుద్ధంగా 1992లో 18 గ్రాములున్న నూనె వాడకం 2005లో 50 శాతానికి చేరినట్టు ఆ సంస్థ పేర్కొంది. అలాగే కొవ్వు వాడకం 41 నుండి 52 గ్రాములకు పెరిగిందని, హైబీపీకి కారణమైన ఉప్పును ఆరోగ్య సంస్థ రోజుకు ఐదు గ్రాములు సూచించినప్పటికీ ఎక్కువమంది 9 నుండి 12 గ్రాములు తీసుకుంటున్నారని, ఈ కారణంగా ఎక్కువమంది పౌరులు అనారోగ్యానికి గురవుతున్నట్టు ఈ సర్వేలో తేలింది. ప్రస్తుతం దేశంలో సుమారు మూడు కోట్లమంది గుండె జబ్బులతో బాధపడుతున్నట్టు భారత ప్రజారోగ్య సంస్థ నివేదిక చెబుతోంది.

  • Loading...

More Telugu News