: ఆత్మవిశ్వాసాన్ని అందించే అందం
పదుగురిలో తాము అందంగా కనిపించాలని ఏ మహిళైనా అనుకుంటుంది. ఒక వయసు వచ్చిన అమ్మాయి నుండి యాభైయేళ్లు దాటిన ఆంటీలు కూడా తాము అందంగా కనిపించాలని కోరుకుంటారు. దీనికి వయసుతో నిమిత్తం లేకుండా ఆయా వయసుకు తగినట్టుగా అందంగా కనిపించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసమే వారు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారని తాజాగా జరిగిన అధ్యయనంలో తేలింది. మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. చదువులోను, ఆటల్లోను, అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలోను ఇలా అన్నింటా వారు తమ సామర్ధ్యాన్ని నిరూపించుకుంటున్నారు. అయితే ఎంత సాధించినా తాము నలుగురిలో అందంగా కనిపించాలనే భావనతో ఇందుకోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తుంటారని తాజా అధ్యయనంలో తేలింది.
తమని అందంగా కనిపించేలా చేసే సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి మహిళలు ఎక్కువ ఖర్చు చేస్తుంటారని ఒక తాజా అధ్యయనంలో తేలింది. బ్యాంకులు, బీమా రంగం, హోటల్ మేనేజ్‌మెంట్ ఇలా ఏ రంగాన్ని పరిశీలించినా వినియోగదారులతో నేరుగా సంప్రదిస్తూ ఉద్యోగాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు ఉన్నంతలో ఖరీదైన దుస్తులను ధరించడం, వాటికి అనువైన ఆక్సెసరీస్, అలంకరణ సామగ్రిని వాడాల్సి ఉంటుంది. దీంతో వీటిపై పెట్టే ఖర్చు పెరుగుతుంది. అయితే ఇంత ఖర్చు పెట్టడం వల్ల మహిళల్లో అందంతోబాటు ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్కసారి మహిళలకు తమ ఆహార్యం విషయంలో నమ్మకం కుదిరాక ఇక ఉద్యోగంలో కూడా చక్కగా రాణించగలుగుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.