: సచిన్ ధాటికి దిగ్గజం చిన్నబోయిన వేళ..


అబ్దుల్ ఖాదిర్.. పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఓ వెలుగువెలిగిన దిగ్గజ లెగ్ స్పిన్నర్. చిత్రమైన బౌలింగ్ యాక్షన్.. అమ్ములపొదిలో వైవిధ్యభరితమైన అస్త్రాలు అతని సొంతం. 1989 నాటికే ఖాదిర్ ప్రపంచస్థాయి బౌలర్. ఈ పాక్ జాతీయుడి హవా కొనసాగుతున్న ఆ రోజుల్లో సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ యవనికపై అప్పుడే అడుగుపెట్టాడు. సరిగ్గా 1989లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్ళింది భారత్. కెప్టెన్ గా శ్రీకాంత్ కు విషమపరీక్ష అని భారత మీడియా ఓవైపు ఊదరగొడుతోంది.

అయితే, ప్రపంచ క్రికెట్ ను తదనంతర కాలంలో శాసించే ఓ ధృవతార ఆ పర్యటన ద్వారా వెలుగులోకి వస్తుందని అటు మీడియా, ఇటు క్రికెట్ ప్రపంచం ఎవరూ ఊహించి ఉండరు. కానీ, యువ సచిన్ ఆ పర్యటనలో ఖాదిర్ పాలిట యమకింకరుడిలా పరిణమించాడు. అప్పటిదాకా గాల్లో విహరిస్తున్న అంతటి ఘనతర లెగ్గీని సైతం తన అమేయ భుజబలం, సునిశిత టెక్నిక్ తో భూమ్మీదకు దించాడు. అదెలాగో.. ఆ పర్యటనకు సచిన్ తో పాటు ఎంపికైన హైదరాబాదీ స్పిన్నర్ అర్షద్ అయూబ్ చెప్పుకొచ్చాడు.

'టెస్టు సిరీస్ కు ముందు పెషావర్లో ఓ ప్రాక్టీసు మ్యాచ్ ఆడాం. ఆ మ్యాచ్ లో నేనూ, సచిన్ బ్యాటింగ్ చేస్తున్నాం. యువ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ బౌలింగ్ లో సచిన్ రెండు సిక్సర్లు కొట్టాడు. అది చూసి అబ్దుల ఖాదిర్.. సచిన్ వద్దకు వచ్చి, చోటే.. మేరేకో నహీ మార్ సక్తా (చిన్నోడా.. నా బౌలింగ్ లో మాత్రం కొట్టలేవు) అని అన్నాడు. సచిన్ మాత్రం మౌనంగానే ఉన్నాడు. కానీ, బ్యాట్ తో జవాబిచ్చాడు దిమ్మదిరిగే రీతిలో. ఈ తర్వాతి ఓవర్ అబ్దుల్ ఖాదిర్ దే. ఆ ఓవర్లో మూడు సిక్సర్లు బాదాడు సచిన్. దీంతో, సిగ్గుతో చితికిపోయాడు ఖాదిర్. ఓవర్ పూర్తయిన తర్వాత తలదించుకుని వెళ్ళిపోయాడు. కానీ, సచిన్ లో మాత్రం రవ్వంతైనా గర్వం కనిపించలేదు.' అని అయూబ్ వివరించాడు. ఆ నిగర్వమే సచిన్ ను ఇంతటివాణ్ణి చేసిందని క్రికెట్ పండితులు చెప్పే మాట.

  • Loading...

More Telugu News