: ప్రమాదం పెద్దది.. అప్రమత్తంగా ఉన్నాం.. సహకరించండి: సీఎం
లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో సచివాలయం నుంచి ఆయన మాట్లాడుతూ.. ముంచుకొస్తున్న తుపాను కనీవినీ ఎరుగనిదని కేంద్ర, రాష్ట్ర నిపుణులు హెచ్చరిస్తున్నారని అన్నారు. సహాయక చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజల క్షేమమే తమకు ముఖ్యం కనుక ప్రజలు సహకరించకుండా ప్రతిఘటించే ప్రాంతాల్లో బలవంతంగా తరలించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించినట్టు సీఎం తెలిపారు.
అవసరమైన సహాయక చర్యలన్నీ చేపడుతున్నట్టు చెప్పారు. రక్షణ చర్యలకు ఆర్మీ, నేవీ, రెవెన్యూ, విపత్తు నివారణ శాఖ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని అన్నారు. అలాగే అత్యవసర సేవల నిమిత్తం హెలీకాప్టర్, అగ్నిమాపక యంత్రాలు, నీటి సదుపాయం, బోట్లు కూడా సమకూర్చుకున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల్ని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం స్పష్టం చేశారు. మొత్తం 22,994 బోట్లలో 22 బోట్లు మాత్రమే తీరం చేరలేదని, వారు సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.
పునరావాస కేంద్రాల్లో నీరు, ఆహారం, పసివాళ్ల ఆరోగ్యం, కమ్యూనికేషన్ వ్యవస్థ వంటి సౌకర్యాలను సమకూర్చామని ప్రజలు అసౌకర్యానికి గురవ్వాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. తాము తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నామని మిగిలినదంతా దేవుడి దయ అని అన్నారు. నష్టం జరుగకుండా మానవ ప్రయత్నం చేయడం తప్ప, మనం ఏమీ చేయలేమని కిరణ్ కుమార్ రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు.
ఇప్పటికే రెవెన్యూ మంత్రి సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 1999లో ఇదే ప్రాంతంలో తుపాను వచ్చిందని.. కవిటి, మందస, వజ్రపుకొత్తూరు ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన గుర్తు చేశారు. గతానుభవాలు పునరావృతం కాకుండా డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్, అగ్రికల్చర్ టీం అందరూ సిద్ధంగా ఉన్నారని సీఎం తమ సన్నద్ధత తెలిపారు.
ఇది అతిపెద్ద తుపాను అని, దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలియదని ఆయన అన్నారు. కురుస్తున్న వర్షాలతో వంశధార, నాగావళి, గోముఖి నదుల్లో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, తాము అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని భరోసా ఇచ్చారు. కానీ రేకు ఇళ్లు, పూరిళ్లు, పాతఇళ్లు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు. భారతదేశంలో అతి పెద్ద తుపాను అని నిపుణులు చెబుతున్నారు కనుక తాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు.