: పదిహేను మందిని టార్గెట్ చేశాం: తీవ్రవాది ఫకృద్దీన్
తమిళనాడు సీఐడీ ఆధీనంలో ఉన్న తీవ్రవాది ఫకృద్దీన్ పలు వాస్తవాలను బయటపెట్టాడు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల్లోని పలువురు కీలక నేతలను తమ టీం టార్గెట్ చేసినట్టు వెల్లడించాడు. తమ నెట్ వర్క్ లో మొత్తం 40 మంది పనిచేస్తున్నారని, అందరూ ప్రముఖ నేతలను అంతమొందించే లక్ష్యంతోనే కార్యకలాపాలు సాగిస్తున్నారని భయంకర నిజాన్ని తెలిపాడు. వీరంతా తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్నారని సీఐడీ అధికారులతో చెప్పాడు. అంతేగాకుండా, హైదరాబాద్ వేదికగా రానున్న రోజుల్లో మరిన్ని విధ్వంసాలను సృష్టించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు ఫకృద్దీన్ వెల్లడించారు.
తమిళనాడు, ఏపీకి చెందిన 15 మంది హిందుత్వవాదులు తమ హిట్ లిస్ట్ లో ఉన్నారని విచారణలో ఫకృద్దీన్ వెల్లడించాడు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ కార్యదర్శి రమేశ్ తో పాటు వెలయప్పన్, సురేష్ లను తమ సభ్యులే మట్టుబెట్టారని ఒప్పుకున్నాడు. అమీర్ అనే వ్యక్తి తాము చేయాల్సిన పనుల గురించి ఆదేశాలు ఇస్తుంటాడని... అయితే అతను ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో తెలియదని ఇంటరాగేషన్ లో వెల్లడించాడు. దీంతో, ఫక్రుద్ధీన్ చెప్పిన వివరాలను ఇతర రాష్ట్ర పోలీసులతో పంచుకుని... వీరి బృందంలోని ఉగ్రవాదులందరినీ పట్టుకునే పనిలో తమిళనాడు సీఐడీ అధికారులు నిమగ్నమయ్యారు.