: అంతరిక్షంలో ఒంటరి గ్రహం
అంతరిక్షంలో గ్రహాలు సాధ్యమైనంతవరకూ ఏదో ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. అయితే ఒంటరిగా తిరిగే గ్రహాలూ కొన్ని వుంటాయి. ఇలా మన సౌరకుటుంబానికి అవతలగా అంతరిక్షంలో ఒంటరిగా తేలుతున్న ఒక గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గ్రహం ఎలాంటి నక్షత్రం చుట్టూ పరిభ్రమించకుండా తేలుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూమికి కేవలం 80 కాంతి సంవత్సరాల దూరంలో అంతరిక్షంలో తేలుతున్న ఒక గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గ్రహానికి పీఎస్‌ఓ జే318.5-22 అనే పేరుపెట్టారు. ఈ గ్రహం ద్రవ్యరాశి గురుగ్రహం ద్రవ్యరాశికన్నా ఆరు రెట్లు ఎక్కువగా ఉంది. సుమారు 1.2 కోట్ల సంవత్సరాల క్రితం ఇది ఏర్పడిందని, అదే కాలంలో పుట్టిన గ్రహాలకన్నా ఇది చిన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ గ్రహం గురించి ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన హవాయి విశ్వవిద్యాలయానికి చెందిన మైఖేల్ లుయి మాట్లాడుతూ, నక్షత్రంతో సంబంధం లేకుండా ఇలా అంతరిక్షంలో తేలియాడే వస్తువును ఇంతకుముందెప్పుడూ చూడలేదని తెలిపారు. నక్షత్రాల చుట్టూ తిరిగే ఇతర గ్రహాలకు గల లక్షణాలన్నీ దీనికి ఉన్నాయని మైఖేల్ చెబుతున్నారు.