: అన్ని పార్టీలతో కేంద్రం వెంటనే చర్చలు జరపాలి: రాఘవులు
రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని సీసీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ఈ చర్చలకు ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి మాత్రం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఎం క్రియాశీలంగా వ్యవహరించాలని హితవు పలికారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. తెలంగాణపై కేంద్ర కేబినెట్ నోట్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని దుయ్యబట్టారు.
విడిపోతే రాష్ట్రం ఎడారిగా మారుతుందని చెప్పిన జగన్... అలా జరగకూడదంటే ఏం చేయాలో చెప్పాలని రాఘవులు డిమాండ్ చేశారు. విజయనగరంలో జరిగిన అల్లర్లకు బొత్స, ఆయన కుటుంబ సభ్యుల నిరంకుశ వైఖరే కారణమని తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి తమ పార్టీ వ్యతిరేకమని చెప్పారు. సీమాంధ్రులపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని రాఘవులు ఆరోపించారు.