: దీంతో మందుబాబులను పట్టుకోవచ్చు
మందుతాగి బండి నడిపే వారిని గుర్తించడానికి నేడు అనేక పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ పరికరాల్లో చాలా వరకూ వారి శ్వాసను పరీక్షించి సదరు వ్యక్తులు మందు తాగారా? లేదా? అనేది గుర్తించడం జరుగుతుంది. అయితే ఈ పరికరాలన్నీ చాలా ఖరీదైనవి. దీనికితోడు మందు తాగివున్నవారి శ్వాసలో ఎంతమేర ఆల్కహాల్ సాంద్రత ఉందనే విషయాన్ని నిక్కచ్చిగా చెప్పలేవు. అలా కాకుండా తాగి వాహనాన్ని నడిపేవారి శ్వాసను పరీక్షించి వారు ఏ మోతాదులో ఆల్కహాల్‌ను తాగివున్నారో కచ్చితంగా చెప్పే కొత్త పరికరాన్ని పరిశోధకులు రూపొందించారు. వాహనాన్ని నడిపేవారి శ్వాసను పరీక్షించినప్పుడు వారు ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తాగివుంటే ఈ పరికరంలోని పచ్చలైటు, ఎరుపురంగులోకి మారిపోతుంది.
ఇటలీకి చెందిన పరిశోధకులు తాగి వాహనాన్ని నడిపేవారిని గుర్తించడానికి ఈ సరికొత్త పరికరాన్ని రూపొందించారు. ఇప్పుడు రహదారుల పక్కన పోలీసులు ఉపయోగించే పరికరాల్లో లేని సౌకర్యాలు దీనిలో ఉంటాయని, ఈ పరికరంలోని సెన్సర్‌ను తిరిగి ఉపయోగించవచ్చని, డిజిటల్ రూపంలో కూడా ఇది ఫలితాన్ని చూపుతుందని, ఆల్కహాల్ మోతాదు చట్టపరంగా అనుమతించని స్థాయిలో ఉందా? లేదా? అనే విషయాన్ని ఈ పరికరం వెంటనే తేల్చేస్తుందని రికార్డో ఫెర్నిన్ అనే పరిశోధకుడు చెబుతున్నారు.