: యువీపై ఒత్తిడి తగ్గిస్తాం: ధోనీ
టీమిండియాలోకి పునరాగమనం చేసిన డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ యువరాజ్ సింగ్ పై ఒత్తిడి లేకుండా చూస్తామని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. రాజ్ కోట్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆసీస్ తో సిరీస్ సందర్భంగా జట్టంతా యువీకి మద్దతుగా నిలుస్తుందని అన్నాడు. ఉపఖండం వేదికగా 2011లో జరిగిన వన్డే వరల్డ్ కప్ అనంతరం యువరాజ్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. అనంతరం కోలుకున్నా మునుపటి ఫాం అందిపుచ్చుకోవడంలో విఫలమై జట్టుకు దూరమయ్యాడు.
ఇటీవలే విండీస్-ఎ జట్టుపై విశేషంగా రాణించడంతో మళ్ళీ సెలెక్టర్లు అతడిని టీమిండియాకు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో డ్రెస్సింగ్ రూంలో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచడం ద్వారా యువీపై ఒత్తిడి లేకుండా చూస్తామని ధోనీ వివరించాడు. జట్టులోకి పునరాగమనం చేసిన ఏ ఆటగాడైనా కొంచెం ఒత్తిడికి గురవడం సహజమని అన్నాడు. తనదైన రోజున ఎలాంటి మ్యాచ్ నైనా మలుపుతిప్పే సత్తా యువీకి ఉందని ధోనీ అభిప్రాయపడ్డాడు. కంగారూలతో సిరీస్ లోనూ యువీ రాణిస్తాడన్న నమ్మకముందని చెప్పాడు.