: జగన్ మీ కొడుకులాంటి వాడు కాదు.. మీ వారసుడే: సోమిరెడ్డి
ఈ ఉదయం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తన కొడుకు లాంటివాడని దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన తనదైన రీతిలో భాష్యం చెప్పారు. జగన్ ఆయన కొడుకులాంటి వాడు కాడని, ఏకంగా కాంగ్రెస్ పార్టీకే వారసుడని విమర్శించారు. ఇక, చంద్రబాబు దీక్షపై స్పందిస్తూ, గతంలో తెలంగాణ ప్రజలు ఆందోళన చేసినప్పుడు కూడా టీడీపీ వారి సమస్యలు పరిష్కరించాలని కోరిందని తెలిపారు.
ఏపీ భవన్ కు వచ్చేవారిని అడ్డుకున్నంత మాత్రాన ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఏపీభవన్ లో బాబు దీక్షను అడ్డుకోవాలని యత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. తెలుగువారితో ఆడుకుంటే ఏ పార్టీకి నూకలుండవని హెచ్చరించారు. కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దీనిపై జాతీయ పార్టీలు స్పందించడంలేదని అన్నారు. జాతీయ పార్టీలకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు పనికిరారా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు.