: భారీగా దిగుమతి అవుతున్న వెండి
దేశంలోకి వెండి భారీగా వచ్చి పడుతోంది. బంగారం, వెండి దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు చర్యలు తీసుకుంది. వీటిపై దిగుమతి సుంకాన్ని 10 శాతానికి పెంచింది. బంగారం దిగుమతులైతే తగ్గాయి కానీ, వెండి దిగుమతులు తగ్గకపోగా, గతేడాదితో పోలిస్తే పెరిగాయి.
ఇటీవలి కాలంలో వెండి ధర కిలోకు 34వేల రూపాయలకు తగ్గి, అక్కడి నుంచి మళ్లీ 50వేల రూపాయలకు చేరుకుంది. కొనుగోలుదారుల నుంచి డిమాండ్ భారీగా పెరిగిపోయిందని వ్యాపారులు అంటున్నారు. బంగారం ధర 30 వేల రూపాయల స్థాయిలో ఉండడంతో సామాన్యులు బంగారానికి బదులుగా వెండిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని వ్యాపారుల విశ్లేషణ.
జీఎఫ్ఎమ్ఎస్ అనే లోహాల కన్సల్టెన్సీ.. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు భారత్ 4,073 టన్నుల వెండి దిగుమతి చేసుకుందని వెల్లడించింది. 2012లో ఇదే కాలంలో దిగుమతి అయిన 1,921 టన్నులతో పోలిస్తే ఈ ఏడాది అంతకు రెట్టింపయిందని తెలుస్తోంది. 2008లో రికార్డు స్థాయి 5,048 టన్నుల దిగుమతిని ఈ ఏడాది అధిగమించవచ్చని భావిస్తున్నారు.